జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌తో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఎర్రగడ్డ డివిజన్లోని సుల్తాన్ నగర్లో ఎంఐఎం అభ్యర్ధి షాహీన్‌బేగం తరఫున ప్రచారానికి వచ్చిన అక్బరుద్దీన్ ఒవైసీ రోడ్‌షోలో హుస్సేన్ సాగర్ ఆక్రమణలపై స్పందిస్తూ ‘దమ్ముంటే పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయండి’ అని వ్యాఖ్యానించారు. బుధవారం బల్కంపేట ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు బదులిస్తూ ‘అదే జరిగితే రెండు గంటల్లో బీజేపీ కార్యకర్తలు ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాంను కూల్చడానికి సిద్ధంగా ఉన్నారని’ ప్రసంగించారు. వీరి వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దీనిని సుమోటోగా స్వీకరించిన ఎస్సార్‌నగర్ పోలీసులు శుక్రవారం రాత్రి ఇద్దరిపై 505(1)(సి) ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
