ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో సీపీఐ అభ్యర్థికి సంబంధించిన కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి గుర్తును బ్యాలెట్ పేపర్‌లో ముద్రించారు. దీంతో సీపీఐ పార్టీ అభ్యర్థి అభ్యంతరం తెలుపడంతో ఆ డివిజన్‌లో ఎన్నికల సంఘం పోలింగ్‌ను నిలిపివేసింది. తిరిగి ఈనెల 3న (గురువారం) ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల అథారిటీ లోకేశ్‌కుమార్ ప్రకటించారు. డివిజన్ రిటర్నింగ్ అధికారి పి.సంధ్యారాణి స్థానంలో సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి బిల్లా శైలజను ఆర్వోగా నియమించినట్లు తెలిపారు. 3న జరిగే ఎన్నికల సందర్భంగా ఓటర్ల ఎడమచేతి మధ్య వేలికి ఇంకు ముద్ర వేయాలని సూచించారు. మొదలు ఉపయోగించిన బ్యాలెట్ బాక్స్‌లను సీల్‌చేసి ప్రత్యేక గదిలో భద్రపర్చాలని ఆదేశించారు. వాటి స్థానంలో కొత్త బ్యాలెట్ బాక్స్‌లను ఉపయోగించాలని కోరారు. పోలింగ్‌కు అవసరమైన సామగ్రిని, సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. గుర్తులు మారడంపై ఆర్వో సహా సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
