ఏసీబీ వలలో ఏఎస్‌వో ప్రదీప్

ఆదిలాబాద్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కార్యాలయంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారిగా పనిచేస్తున్న ప్రదీప్ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ .4,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడ్డాడు. ఆదిలాబాద్ రూరల్ మండలం అనుకుంటకు చెందిన శరత్ అనే కాంట్రాక్టర్ గ్రామంలో సిమెంట్ రోడ్డు పనులను చేశాడు. రోడ్డు పనులకు సంబంధించిన బిల్లుల కోసం అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రదీప్ రూ.4 వేలు డిమాండ్ చేశాడు. 

ఈ మేరకు కాంట్రాక్టర్ శరత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈరోజు ఉదయం 11.30 గంటల సమయంలో కాంట్రాక్టర్ నుంచి ప్రదీప్ రూ. 4 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఏసీబీ  అధికారులు కార్యాలయంలో పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు.