ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

లంచం తీసుకుంటూ ముగ్గురు అధికారులు వేర్వేరు చోట్ల ఏసీబీ అధికారులకి చిక్కారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈ ఘటనలు శుక్రవారం చోటుచేసుకున్నాయి. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో డ్రైనేజీ, పైపులైన్ల పనులకు పెద్దమునగాల మాజీ ఎంపీటీసీ కేతావత్‌ సోమానినాయక్‌ టెండర్‌ దక్కించుకుని పనులు పూర్తిచేశాడు.బిల్లు మంజూరు కోసం ఆర్వీఎం సైట్‌ ఇంజినీర్‌ స్వామినాయక్‌ రూ.లక్ష లంచం డిమాండ్‌ చేశాడు. శుక్రవారం మిర్యాలగూడ వన్‌టౌన్‌  సమీపంలో బాధితుడి నుంచి రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా స్వామినాయక్‌ను పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల ఎస్సై చందర్‌..

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని మాసాన్‌పల్లికి చెందిన ఖాసీం అక్టోబర్‌ 29న పీడీఎస్‌ బియ్యాన్ని రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. నవంబర్‌ 2న అరెస్టు కాగా బెయిల్‌పై విడుదలయ్యాడు. బియ్యం వ్యాపారం కొనసాగించాలంటే రూ.50 వేలు లంచంతోపాటు, ప్రతి నెలా రూ.30 వేలు మామూళ్లు ఇవ్వాలని ఖాసీంను ఎస్సై చందర్‌ డిమాండ్‌ చేశాడు. రూ.40 వేలకు ఒప్పందం కుదిరింది.అనంతరం ఖాసీం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఎస్సై సూచన మేరకు శుక్రవారం రూ.40 వేలను గుండాలలోని విజయలక్ష్మి పెట్రోల్‌ బంకులో అక్కడి సూపర్‌వైజర్‌ మహేశ్వరం గణేశ్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గణేశ్‌తోపాటు ఎస్సై చందర్‌పై కేసు నమోదుచేసినట్టు ఏసీబీ డీఎస్పీ మధుసూదన్‌ తెలిపారు.

ఆదిలాబాద్‌లో ఏఎస్‌వో ప్రదీప్‌కుమార్..

ఆదిలాబాద్‌ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయంలో అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ అధికారి ప్రదీప్‌కుమార్‌.. సీసీరోడ్డు పనులకు సంబంధించిన రూ.5 లక్షల బిల్లు చేయడానికి రూ.5 వేలు లంచం డిమాండ్‌ చేశాడు.  ఈ మేరకు శుక్రవారం కాంట్రాక్టర్‌ శరత్‌ నుంచి ఏఎస్‌వో ప్రదీప్‌కుమార్‌ రూ.4 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు కరీంనగర్‌ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.