పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం ఉదయం వెళ్లారు. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న బాధితులను జగన్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన జగన్, బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు.
ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లోడు ఒక్కసారిగా కండ్లు తిరిగి పడిపోయాడు.. ఆ పక్కవీధిలోనే నడుచుకుంటూ వెళ్తున్న ఓ పెద్దమనిషి ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వ్యవసాయ పనులకు వెళ్లి అప్పుడే ఇంటికి వచ్చిన ఓ మహిళ నోటి నుంచి నురగలు కక్కుకొంటూ కింద పడిపోయింది. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు వంద మంది మూర్ఛ, కండ్లు తిరిగి అస్వస్థతకు గురయ్యారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణం ఒక్కసారిగా అల్లాడిపోయింది. ఆర్తనాదాలతో జనాలు దవాఖానలకు పరుగులు తీశారు.
శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఏలూరులోని పడమర వీధి, కొత్తపేట, తాపీమేస్త్రీ కాలనీ, అశోక్‌నగర్, శనివారపుపేట, ఆదివారపుపేట, తంగళ్లమూడి, అరుంధతిపేట ప్రాంతాల్లో దాదాపు 292 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒకరు మృతి చెందారు. కొందరు చిన్నారులు, మహిళలు, వృద్ధులకు ఫిట్స్ కూడా వచ్చాయి. ప్రజలు మూర్ఛ, కండ్లు తిరిగి ఎందుకు పడిపోతున్నారో డాక్టర్లకు అంతుచిక్కలేదు. సీటీ స్కానింగ్ తీసినా ఫలితం లేకపోయింది. ఇప్పటి వరకు వచ్చిన రిపోర్టులన్నీ సాధారణంగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు విజయవాడ నుంచి ప్రత్యేక వైద్య బృందాలు ఏలూరుకు చేరుకున్నాయి. లక్షణాలు కనిపించిన ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటుచేసి ఇంటింటా ఆరోగ్య సర్వే చేశారు. రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌లకు పంపించారు.
బాధితులకు ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో వారిని డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. పరిస్థితి విషమంగా ఉన్న పదిమందిని మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ఏలూరు ప్రభుత్వ దవాఖానలో అదనపు బెడ్లు ఏర్పాటుచేశారు. ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నాని దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు.. నీటి కలుషితం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు ప్రాథమిక నివేదికలు తెలుపుతున్నాయి. ఈ నివేదికలను స్థానిక అధికారులు ధ్రువీకరించాల్సి ఉన్నది.