నేరేడ్‌మెట్‌లో టీఆర్‌ఎస్‌ విజయం

గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో నిలిచిన నేరెడ్‌మెట్ ఫ‌లితం వెల్ల‌డి అయింది. నేరెడ్‌మెట్ 136వ డివిజ‌న్‌లో 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్య‌ర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కార్పొరేట‌ర్ల సంఖ్య 56కు చేరింది.  

నిలిచిపోయిన నేరెడ్‌మెట్‌ డివిజన్‌ ఓట్లను లెక్కించేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వ‌డంతో.. బుధ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు ఆ డివిజ‌న్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. సైనిక్‌పురిలోని భ‌వ‌న్స్ వివేకానంద కాలేజీలో ఓట్ల లెక్కింపు జ‌రిగింది.   నేరెడ్‌మెట్ డివిజ‌న్ మొత్తంలో 25,176 ఓట్లు పోల‌వ్వ‌గా 24,632 ఓట్లు లెక్కించారు. డిసెంబ‌ర్ 4న లెక్కించిన వాటిలో 504 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్య‌ర్థి ముందంజ‌లో ఉన్నారు. హైకోర్టు తీర్పుతో ఇత‌ర గుర్తులున్న 544 ఓట్లను బుధ‌వారం ఉద‌యం లెక్కించారు. అనంత‌రం టీఆర్ఎస్ అభ్య‌ర్థి 782 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు వెల్ల‌డించారు.