ఏపీ ప్రభుత్వం సర్వే ఆఫ్‌ ఇండియాతో కీలక ఒప్పందం

ఆంధ్రపదేశ్‌ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. సర్వే ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం చేసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ‘వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’లో భాగంగా సర్వే ఆఫ్‌ ఇండియాతో ఎంవోయూ కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సర్వే ఆఫ్‌ ఇండియాతో ఈ ఒప్పందం జరిగింది. అనంతరం ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం’ పై కలెక్టర్లతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  సీఎం మాట్లాడుతూ.. సర్వే ఆఫ్‌ ఇండియాతో అవగాహన ఒప్పందం చేసుకోవటం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే కార్యక్రమం అన్నారు. ఏపీ ప్రభుత్వం, సర్వే ఆఫ్‌ ఇండియాతో కలిసి సమగ్ర సర్వే చేస్తుందని, దేశంలో తొలిసారిగా ఇంత పెద్దస్థాయిలో సర్వే చేస్తున్నామని తెలిపారు. ఇంటి స్థలం, పొలం, స్థిరాస్తులపై ఒక టైటిల్‌ ఇచ్చిన తర్వాత రెండేళ్ల పాటు అబ్జర్వేషన్‌లో అదే గ్రామ సచివాలయంలో పెడతామని వెల్లడించారు. ఆ టైటిల్‌ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని చెబుతున్నామని తెలిపారు. రెండేళ్ల తర్వాత టైటిల్‌కు శాశ్వత భూహక్కు లభించండతోపాటు టైటిల్‌ ఖరారు చేస్తుందన్నారు. ఆ తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకుని పరిహారం చెల్లిస్తుందని పేర్కొన్నారు.