బొల్లారం అగ్ని ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి మల్లారెడ్డి ఆదివారం పరామర్శించారు. బాచుపల్లి హాస్పిటల్లో బాధితులను ఆయన కలిసి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. పరిశ్రమలో రియాక్టర్ నాణ్యతా లోపం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. నిబంధనలు పాటించని 500 రసాయన పరిశ్రమలకు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. బాధితులకు ప్రభుత్వం తరఫున సహాయం అందజేస్తామని, అలాగే యాజమాన్యం తరఫున కూడా ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.