నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఓ కంపెనీపై పొల్యుషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వేటు వేశారు. మర్‌క్యాప్టెన్ (ఘాటు) వాసనలకు కారణమైన కంపెనీని మూసివేస్తూ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. వివిన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్‌ను గడ్డపోతారంలోని సర్వేనెంబర్ 10/ఏలో నడుపుతున్నారు. ఇటీవలి కాలంలో కంపెనీ నుంచి వాసనలు వస్తుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టి సెక్షన్ 33(ఏ) వాటర్, సెక్షన్ 31(ఏ) ఎయిర్ యాక్ట్‌ల ప్రకారం బోర్డు నిబంధనలు ఉల్లంఘించినందుకు కంపెనీని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కంపెనీ నడవకుండా తక్షణమే విద్యుత్ కనెక్షన్ తొలగించాలని కోరుతూ టీఎస్‌ఎస్పీడీసీఎల్ అధికారులకు లేఖ రాశారు.