న‌ల్ల‌గొండ జిల్లాలో ఎస్‌హెచ్‌జీ ఖాతాల సొమ్ము రూ. కోటి కాజేసిన వైనం

స్వయం సహాయక బృందాల పొదుపు అదేవిధంగా అప్పు వాయిదాల చెల్లింపులలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న న‌ల్ల‌గొండ జిల్లాలో చోటుచేసుకుంది. పోస‌పోయామ‌ని గుర్తించిన మ‌హిళా సంఘాల స‌భ్యులు నల్లగొండ ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్‌రెడ్డి సహకారంతో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. వివ‌రాలిలా ఉన్నాయి. 

నల్లగొండ నియోజకవర్గంలోని కనగల్ మండలం తుర్కపల్లి గ్రామంలో సుమారు 500 మంది మహిళలు 34 స్వయం సహాయక బృందాలుగా ఏర్పడ్డారు. వీరు చేసిన‌ పొదుపు మొత్తాలను అదేవిధంగా ప్రభుత్వం అందించే రుణాలను తిరిగి చెల్లించే వాయిదాలను వీవోఏ, సెర్ప్ గ్రామ సీసీలు క‌లిసి సుమారు రూ. కోటి వ‌ర‌కు కాజేశారు. దీంతో త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్‌రెడ్డిని క‌లిసి అభ్య‌ర్థించారు. 

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వీరందరినీ జిల్లా ఎస్పీ వద్దకు తీసుకుని వెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్పీ రంగనాధ్ స్పందిస్తూ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపి తగు చర్యలు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ఎస్పీని కలిసిన వారిలో  నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,  కనగల్ మండల పరిషత్ అధ్యక్షులు కరీం పాషా, కనగల్ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు రామగిరి శ్రీధర్ రావు, స్థానిక సర్పంచ్ ఆదిమల్ల లింగయ్య, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షులు ఐతగోని యాదయ్య, కార్యదర్శి జొన్నలగడ్డ శేఖర్ రెడ్డి, హనుమంతు నాయక్, చెన్నగోని యాదగిరి తదితరులు ఉన్నారు.