రేపటినుంచే పతంగుల పండుగ

రేపటినుంచి పతంగుల పండుగ

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కైట్‌, స్వీట్‌ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఈ నెల 13 (సోమవారం) నుంచి 15 వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో కైట్‌, స్వీట్‌ ఫెస్టివల్‌ జరుగనున్నది. కైట్‌ఫెస్టివల్‌లో 20 నుంచి 40 దేశాల అంతర్జాతీయస్థాయి కైట్‌ప్లేయర్స్‌, 25 రాష్ట్రలకు చెందిన 60 మంది కైట్‌ప్లేయర్స్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన కైట్‌ప్లేయర్స్‌ కూడా పాల్గొంటారని చెప్పారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వివిధ రాష్ట్రలకు చెందిన మహిళలు ఇంట్లో స్వయంగా తయారు చేసిన 1000 రకాల స్వీట్లు, తెలంగాణ వంటలు అందుబాటులో ఉంచుతారన్నారు. కైట్‌ఫెస్టివల్‌లో తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, ఈ ఫెస్టివల్‌కు 15 లక్షలమంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. అనంతరం పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో టూరిజం డిపార్ట్‌మెంట్‌ చైర్మన్‌ భూపతిరెడ్డి, ఎండీ మనోహర్‌, సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, క్లిక్‌ ప్రతినిధులు బెంజిమెన్‌, అభిజిత్‌, వీణ పాల్గొన్నారు.