తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న క్రషర్లపై అధికారులు చర్యలు చేపట్టారు. ఉస్మాన్‌నగర్ గ్రామంలో ఒకటి, కొల్లూర్ గ్రామంలో ఐదు చోట్ల క్రషర్లను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఉస్మాన్‌నగర్, కొల్లూర్ గ్రామాల్లో క్రషర్లను నిర్వహిస్తున్నట్లు గ్రామస్తుల నుంచి సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావుకు ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన స్పందించారు. క్రషర్లపై చర్యలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ, మైనింగ్, పీసీబీ, మున్సిపల్, విద్యుత్‌శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ జరిపి పోలీసుల బందోబస్తు మధ్య బుధవారం రాత్రి సీజ్ చేశారు. కాగా, క్రషర్లను సీజ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై తహసీల్దార్ శివకుమార్ మాట్లాడుతూ సంగారెడ్డి కలెక్టర్ ఆదేశాల మేరకు ఉస్మాన్‌నగర్, కొల్లూర్ గ్రామాల్లోని హనుమాన్ ఎంటర్‌ప్రైజెస్స్, కొల్లూర్ గ్రామంలో ఆక్రిడ్ ఇన్‌ఫ్రా, పుల్లూరి మైనింగ్ అండ్ లాజిస్టిక్, గోల్డ్‌డస్ట్ క్రషర్, సాయిబాలాజీ రాక్స్ అండ్ ఇండస్ట్రీస్స్, హైటెక్ స్టోన్ అండ్ రోబోశాండ్ మొత్తం 6 క్రషర్లను సీజ్ చేసినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా క్రషర్లను నిర్వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
