ములుగు మండలంలోని మద్యం దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలపై మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఎక్సైజ్ అధికారులను నిలదీశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడారు. గ్రామాల్లో గుడుంబా విక్రయాలతో పాటు బెల్ట్ షాపుల నిర్వహణపై ఎక్సైజ్ అధికారులను సభ్యులు ప్రశ్నించగా సీఐ సుధాకర్ స్పందిస్తూ రాతపూర్వకంగా ఫిర్యాదులు అందిస్తే చర్యలు తీసుకుంటామని సభ్యులకు వివరించారు. ఎంపీటీసీ పోరిక విజయ్‌రాంనాయక్ మాట్లాడుతూ గతంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సభకు వివరించాలని పట్టుబట్టారు. తన సెల్ ఫోన్ నుంచి పంపిన ఫిర్యాలను ఏం చేశారంటూ నిలదీశారు. దీంతో ఎంపీపీ స్పందించి మండల సభలో తీర్మానం చేసి ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అదేవిధంగా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సమావేశానికి రాకుండా అరకొర సమాచారంతో కింది స్థాయి సిబ్బందిని సమావేశానికి పంపించడంపై సభ్యులు నిలదీశారు. ఇది ఇలా ఉండగా మిషన్ భగిరథ అధికారులు సమావేశానికి హాజరైన సభ్యులకు మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయిన వాటర్ బాటిళ్లను అందించారు. సమావేశంలో జడ్పీటీసీ సకినాల భవాని, జడ్పీకోఆప్షన్ మెంబర్ రియాజ్‌మిర్జా, మండల కోఆప్షన్ మెంబర్ యూనుస్, ఎంపీటీసీలు తిరుపతిరెడ్డి, లాలు, మాసిపెద్ది పుష్పనీల, గొర్రె సమ్మయ్య, మాచర్ల ప్రభాకర్, నూనవత్ మహేశ్, ఎంపీడీవో భూక్య రవి, తహసీల్దార్ సత్యనారాయణస్వామి, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.
