పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కోరారు. స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా ‘గుడ్ మార్నింగ్ మిర్యాలగూడ’ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్‌తో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్‌చౌక్ నుంచి ఎఫ్‌సీఐ క్వార్టర్స్ వరకు గల సాగర్ ప్రధాన రహదారికి ఇరువైపులా పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించారు. అనంతరం మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని కాలనీలను శుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, కౌన్సిలర్లు ఉదయ్‌భాస్కర్, సలీమ్, జావేద్ నాయకులు ఖాదర్, మగ్దూంపాషా పాల్గొన్నారు.
