యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామ పరిధిలో గల ఆస్ట్రాక్ కెమికల్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు గ్యాస్ పైపు లీక్ అయింది. దాని కారణంగా పక్కనే ఉన్న అల్యూమినియం డోర్స్ తయారీ పరిశ్రమకు చెందిన నలుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. ఆస్ట్రాక్ కెమికల్ పరిశ్రమను మూసివేయాలంటూ స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో ఎస్ఐ రాఘవేందర్ అక్కడకు చేరుకుని దీనిపై పూర్తి విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలపడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
