శ్రీ‌వారి ఆల‌యంలో 25న వైకుంఠ ఏకాద‌శి, 26న వైకుంఠ ద్వాద‌శి

తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో  25వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి, 26న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జ‌రుగ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా శుక్రవారం నుంచి జ‌న‌వ‌రి 3వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శనం క‌ల్పిస్తారు. ఇందులో భాగంగా 25న తెల్లవారుజామున 12.05 నుంచి 1.30 గంటల వరకు ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉద‌యం 1.30 నుంచి 2.30 గంట‌ల వ‌ర‌కు ఏకాంతంగా అభిషేకం చేప‌డ‌తారు. నిజ‌పాద ద‌ర్శనం ఉండ‌దు. ఆ త‌రువాత ఏకాంతంగా తోమాల సేవ‌, అర్చన నిర్వహిస్తారు. ఉద‌యం 4.30 గంట‌ల నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.