ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలో జరిగిన ఘటనపై సీఎం స్పందించారు. గురువారం ఆయన సీఎంఓ అధికారులతో సమీక్ష సమావేశంలో విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. విగ్రహాల ఘటనలు జరుగడం దారుణమని, దేవుడితో చెలగాటం ఆడితే ఆయనే శిక్షిస్తాడన్నారు. ఈ మేరకు దేవతా విగ్రహాలను ధ్వంసానికి పాల్పడితే కఠిన పరిణామాలుంటాయని తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇలాంటి ఘనటకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సంఘటనలకు పాల్పడే వ్యక్తుల్లో భయం కల్పించేలా పోలీసుశాఖ కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని ఆదేశించారు. అలాగే ఘటనలు జరుగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.