తెలంగాణ హైకోర్టు తొలి మహిళా చీఫ్‌జస్టిస్‌గా జస్టిస్‌ హిమాకోహ్లీ

తెలంగాణ హైకోర్టు తొలి మహిళా చీఫ్‌జస్టిస్‌గా జస్టిస్‌ హిమాకోహ్లీ నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న ఆమెకు పదోన్నతి కల్పించారు. హిమాకోహ్లీని తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫారసు చేయగా కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఆమెను తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నియమిస్తూ గురువారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారు. ఆమె విధుల్లో చేరినప్పటి నుంచి నియామకం అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2019 జనవరి 1న  తెలంగాణ హైకోర్టు ఏర్పడింది. తొలి చీఫ్‌ జస్టిస్‌గా తొట్టతిల్‌ బీ రాధాకృష్ణన్‌ వ్యవహరించారు. తర్వాత రాఘవేంద్రసింగ్‌చౌహాన్‌ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మూడో చీఫ్‌ జస్టిస్‌గా హిమాకోహ్లీ నియమితులయ్యారు.