భూ వివాదంలో తలదూర్చిన చౌటుప్పల్‌ సీఐ చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్, ఎస్‌ఐ నర్సయ్యపై సస్పెషన్‌ వేటు

భూవివాదంలో తలదూర్చినందున చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌. వెంకన్నగౌడ్‌, ఎస్‌ఐ నర్సయ్యపై సస్పెషన్‌ వేటు పడింది. అదే విధంగా స్థానిక ఏసీపీ సత్తయ్యకు చార్జ్‌ మెమో జారీ అయింది. ఈ మేరకు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌భగవత్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల పరిధిలోని తాళ్లసింగారం గ్రామంలో 2.33 ఎకరాల భూమికి సంబంధిం వివాదం నెలకొంది. దాంతో ఇరువర్గాల వారు పోలీసులను ఆశ్రయించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. 

ఈ క్రమంలో భువనగిరి కోర్టు పట్టాదారుడికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. సదరు కోర్టు ఉత్తర్వులను ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐ ఖాతరు చేయలేదు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం భూమికి యజమానిగా ఉన్న వ్యక్తి ఇటీవల రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ను ఆశ్రయించాడు. దాంతో కమిషనర్‌ ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించగా ఆరోపణలు వాస్తవమని తేలడంతో సీఐ, ఎస్‌ఐని సస్సెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా పర్యవేక్షణ లోపం కారణంగా స్థానిక ఏసీపీ సత్తయ్యకు మెమో జారీ చేశారు.