నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. దాదాపు అన్ని శాఖల పనితీరును సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, వైద్యారోగ్య, విద్య, అటవీశాఖలతోపాటు ఇతరశాఖల ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. ప్రగతిభవన్‌లో 11.30 గంటల నుంచి ప్రారంభమయ్యే ఉన్నతస్థాయి సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ధరణి, తెలంగాణకు హరితహారం, గ్రామగ్రామాన నర్సరీలతోపాటు, కరోనా టీకా పంపిణీకి కార్యాచరణ, విద్యాసంస్థల ప్రారంభంపై ప్రధానంగా చర్చ జరుగనున్నది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో సీఎం కేసీఆర్‌ చర్చించనున్నారు. టీకాను అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడం, ప్రజలకు అందించే కార్యాచరణ రూపొందిస్తారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును సమీక్షిస్తారు. రాష్ట్రంలో ఉద్యమంలా సాగుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. కార్యక్రమాన్ని గ్రామగ్రామాన మరింత పటిష్ఠంగా అమలు పరచడానికి సీఎం పలు సూచనలను చేస్తారని అధికారులు తెలిపారు.