తెలంగాణ రాష్ట్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీకి, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి ప్రభుత్వం నూతన వైస్ చాన్స్లర్లను నియమించింది. ఉద్యాన వర్సిటీ వీసీగా డాక్టర్ బీ నీరజ ప్రభాకర్, వెటర్నరీ వర్సిటీ వీసీగా డాక్టర్ వంగూర్ రవీందర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సంబంధిత ఫైలుపై సీఎం కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం వెటర్నరీ యూనివర్సిటీ 2014 నవంబరు 22న, ఉద్యాన యూనివర్సిటీ డిసెంబరు 23న ప్రారంభమయ్యాయి. ఈ ఇద్దరు రెండు యూనివర్సిటీలకు తొలి వీసీలు కావడం గమనార్హం. ఇప్పటివరకు ఉద్యాన వర్సిటీకి వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వెటర్నరీ వర్సిటీకి పశు సంవర్ధకశాఖ కార్యదర్శి అనితరాజేంద్ర ఇంచార్జి వీసీలుగా వ్యవహరిస్తున్నారు. ఉద్యాన వర్సిటీ వీసీగా నియమితులైన బీ నీరజ ప్రస్తుతం అశ్వారావుపేట వ్యవసాయ కాలేజీలో అసోసియేట్ డీన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన రవీందర్‌రెడ్డి వెటర్నరీ విద్యను, ఆ తర్వాత పీహెచ్డీ కూడా పూర్తిచేశారు. ఆయన తెలంగాణ ఏర్పడ్డాక పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ పౌల్ట్రీ విభాగంలో ఇంచార్జి డీన్‌గా, ఇంచార్జి రిజిస్ట్రార్‌గా పనిచేశారు. రెండేండ్ల క్రితం ఆయన పదవీ విరమణ పొందారు.
