కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ టీకా ప్రక్రియను ప్రారంభించిన సీఎం జగన్‌

సర్వజనాసుపత్రి (జీజీహెచ్‌)లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఆయన వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. హెల్త్ వర్కర్‌ పుష్పకుమారికి తొలి టీకాను వైద్యులు వేశారు. అనంతరం హెల్త్‌వర్కర్ నాగజ్యోతికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో 3.87 లక్షల మందికి తొలిదశలో వ్యాక్సిన్‌ వేయనున్నారు. విజయవాడలోని గన్నవరం వ్యాక్సిన్‌ స్టోర్‌ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్‌ను పంపిణీ  చేశారు. శనివారం ఉదయం నుంచి ఆయా కేంద్రాల వద్ద నిర్ణయించిన మేరకు ఆరోగ్యశాఖలో పనిచేసే (ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లు) అందరికీ వ్యాక్సిన్‌ వేయనున్నారు. ఒక్కోకేంద్రం వద్ద రోజుకు 100 మందికి చొప్పున మొత్తం రోజుకు 33,200 మందికి వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు చేపట్టారు.