ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మంగళవారం కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్‌కు చేరుకోనున్నారు. అధికారులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సీఎం సందర్శించనున్నారు. మేడిగడ్డ వద్ద నీటిమట్టం వంద అడుగులకు చేరింది. ఐదు నెలల విరామం తర్వాత కాళేశ్వరంలో మళ్లీ నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లింక్-1, 2లలో గోదావరి జలాల తరలింపు లక్ష్యంగా మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత ప్రధానమైంది మేడిగడ్డ బ్యారేజ్. కాళేశ్వరం వద్ద గోదావరిలో ప్రాణహిత కలిసే ప్రాంతానికి ఎగువన మేడిగడ్డ బ్యారేజ్‌ను నిర్మించారు. రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసే విధంగా డిజైన్ చేసి 1.67 కిలోమీటర్ల పొడవుతో బ్యారేజ్ పూర్తిచేశారు. దీనికి 85 గేట్లను అమర్చి కుడి, ఎడమ వైపున కర కట్టలు కట్టారు. కుడి(తెలంగాణ)వైపున 6.30 కిలోమీటర్లు, ఎడమ (మహారాష్ట్ర) వైపున 11.7 కిలో మీటర్లు కరకట్టలను నిర్మించారు.