సోనూసూద్ అంబులెన్స్ స‌ర్వీస్ ప్రారంభం

క‌రోనా క‌ష్ట‌కాలంలో దేవుడిలా మారి అడిగిన వారికి లేద‌న‌కుండా సాయం చేసిన ఆప‌ద్భాంద‌వుడు సోనూసూద్. లాక్‌డౌన్ స‌మ‌యం నుండి సేవ‌లు చేసుకుంటూ వెళుతున్న సోనూసూద్‌ని కొంద‌రు దేవుళ్ళ‌లా కొలుస్తున్నారు. గుడులు క‌డుతున్నారు. తెలంగాణ‌లోని కొన్ని ఊర్ల‌లో ఆయ‌న‌కు ప్ర‌త్యేక పూజలు చేస్తున్నారు. సేవా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌తి రోజు వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న సోనూసూద్ రీసెంట్‌గా త‌న టీం మెంబ‌ర్స్‌కు మొబైల్స్ బ‌హుమ‌తిగా ఇచ్చాడు.
ఇక ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి సోనూసూద్ అంబులెన్స్ స‌ర్వీస్‌ని ప్రారంభించాడు. హైదరాబాద్ ప్రజలకు సుపరిచితమైన ట్యాంక్ బండ్ శివ ఈ ఉచిత అంబులెన్స్‌ సర్వీసును నడపనున్నారు. ఈ అంబులెన్స్ సర్వీస్‌ను నటుడు సోనూ సూద్ స్వయంగా మంగళవారం ట్యాంక్ బండ్‌పై ప్రారంభించారు.  దాతల సహాయంతో ఈ అంబులెన్స్‌ను కొనుగోలు చేశానని, తనకు స్ఫూర్తి ప్రదాత అయిన సోనూ సూద్ పేరును ఈ అంబులెన్స్‌కు పెట్టుకున్నానని శివ వెల్లడించారు.