అన్నాడీఎంకే బ‌హిష్కృత నేత శ‌శిక‌ళ జైలు నుంచి విడుద‌ల‌

అన్నాడీఎంకే బ‌హిష్కృత నేత శ‌శిక‌ళ జైలు నుంచి విడుద‌ల అయ్యారు. అవినీతి కేసులో శ‌శిక‌ళ నాలుగేళ్ల జైలు శిక్ష అనుభ‌వించింది. ఈ శిక్ష నేటితో పూర్తి అయింది. అయితే కొద్దిరోజుల క్రితం.. క‌రోనా బారిన‌ప‌డ్డ శ‌శిక‌ళ బెంగ‌ళూరు విక్టోరియా ఆస్ప‌త్రిలో చేరిన విష‌యం తెలిసిందే. జ‌న‌వ‌రి 20వ తేదీ నుంచి ఆమె క‌రోనా చికిత్స పొందుతున్నారు. ఈ క్ర‌మంలో ఆమె విడుద‌ల‌కు సంబంధించిన ప్ర‌క్రియను ఆస్ప‌త్రిలోనే అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే శశికళ జైలు నుంచి విడుదలయ్యేందుకు ఆమె రూ.10కోట్ల జరిమానా చెల్లించారు.

వైద్యుల‌తో చ‌ర్చించి డిశ్చార్జిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని బంధువులు తెలిపారు. ప్ర‌స్తుతం శ‌శిక‌ళ ఆరోగ్యం మెరుగ్గానే ఉంద‌ని ఆస్ప‌త్రి వైద్యులు స్ప‌ష్టం చేశారు. మ‌రో 10 రోజుల పాటు ఆస్ప‌త్రిలోనే ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వైద్యులు పేర్కొన్నారు.