పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కుల ధ్రువపత్రాలపై ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం స్పష్టత ఇచ్చింది. కుల ధ్రువపత్రాలను త్వరగా ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తాసిల్దార్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశించారు. ఇప్పటికే ఉన్న కుల ధ్రువపత్రాలను స్వీకరించాలని రిటర్న్ అధికారులకు సూచించింది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడుత నామినేషన్ల పర్వం శుక్రవారం నుంచి ప్రారంభమైంది.
ఆదివారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. వచ్చే 4న నామినేషన్ల ఉపసంహరణ, 9న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. తొలి విడుత విజయనగరం జిల్లా మినహా 12 జిల్లాల్లో ఎన్నికలుంటాయి. 12 జిల్లాల్లోని 18 డివిజన్ల పరిధిలోని 168 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నది.