శబ్ద కాలుష్యం చేస్తున్న 1,134 వాహనాలు సీజ్‌ : హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ అనిల్‌కుమార్‌

శబ్ద కాలుష్యం చేస్తున్న 1,134 వాహనాలను సీజ్‌ చేసినట్లు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నగరంలోని కేబీఆర్‌ పార్కు ఆవరణలో ట్రాఫిక్‌ నియమాలు, జరిమానాలపైన అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ అనిల్‌కుమార్‌, వెస్ట్‌జోన్‌ ట్రాఫిక్‌ డీసీపీ చౌహాన్‌, తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ట్రాఫిక్‌ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 65 డెసిబుల్స్‌ కన్నా ఎక్కువ శబ్దం వచ్చే వాహనాలను సీజ్‌ చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో భాగంగానే ఒక్క జనవరి మాసంలోనే శబ్దకాలుష్యం చేస్తున్న 1,134 వాహనాలను సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.