ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. సాయంత్రం 5 గంటల్లోగా నామినేషన్లు దాఖలు చేయవచ్చని అధికారులు తెలిపారు. తొలిదశలో విజయనగరం మినహా 12 జిల్లాల్లోని 168 మండలాల్లోని 3249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డులకు ఎన్నికలు జరుగనుండగా.. ఇప్పటికే పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు భారీగా దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ స్థానాలకు దాదాపు 7,460, వార్డులకు 23, 318 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా.. శనివారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో ఇప్పటి వరకు సర్పంచ్ స్థానాలకు 8,773, వార్డులకు 25,519 మంది నామపత్రాలను అధికారులకు అందజేశారు.
ఇంత వరకు వచ్చిన నామినేషన్లలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో సర్పంచ్ పదవికి 11,056, తూర్పు గోదావరి జిల్లాలో వార్డు స్థానాలకు అత్యధికంగా 4,678 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ నేటితో ముగియనుండగా.. సోమవారం అధికారులు వాటిని పరిశీలించనుండగా.. ఫిబ్రవరి 4వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇచ్చారు. అదే రోజు చివరికి బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతోపాటు గుర్తులను కేటాయించనున్నారు. మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 9న జరుగనుంది. అదే రోజు ఓట్లను లెక్కించి, ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక రెండో దశ పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ ఫిబ్రవరి 2న నోటిఫికేషన్ ప్రకటించనుంది.