గొంగ్లూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఐటీ అధికారులకు మంత్రి హరీశ్‌రావు అభినందన

సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం గొంగ్లూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును అభినందించారు. ఇన్‌కం టాక్స్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులు ఆదివారం మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం విధుల్లో తీరిక లేకుండా గడిపే అధికారులు సామాజిక బాధ్యతగా గొంగ్లూరును దత్తత తీసుకొని.. ప్రజల కోసం పని చేయడం అభినందనీయమన్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించారు. రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా, మార్కెటింగ్ సదుపాయాల కల్పనపై ప్రభుత్వ చేపట్టిన కార్యక్రమాలను వారికి మంత్రి వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల‌ు లక్ష్యం చేరుకుంటున్న తీరును వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ పథకాలు దేశానికే ఆదర్శమని తెలిపారు. మిషన్‌ భగీరథ ద్వారా శుద్ధి చేసిన నీటిని నల్లాల ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరం అనీ, ప్రాజెక్టు నిర్మాణ నైపుణ్యం, దీంతో సాధించిన విజయాలను అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా అధికారులు సిద్దిపేట అభివృద్ధిని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేటకు వచ్చి అభివృద్ధి పనులను పరిశీలిస్తామని చెప్పగా.. వారికి హరీశ్‌రావు సాదర స్వాగతం పలికారు. అనంతరం గొంగ్లూరు‌ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అధికారులతో కలిసి వెళ్లారు. కలెక్టర్‌ హన్మంతరావు, ఇతర జిల్లా అధికారులు ఉన్నారు.