కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని మోదీ స్పందించారు. ప్రస్తుత బడ్జెట్లో హెల్త్‌కేర్‌పై దృష్టిపెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ బడ్జెట్‌తో దేశ ప్రజల సంపద, ఆరోగ్యం వృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. అసాధారణ పరిస్థితుల్లో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని, ఇది భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని, ఆత్మనిర్భర్ విజన్‌తో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు పీఎం తెలిపారు. దేశ ప్రగతి, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు, మౌళిక సదుపాయాల కల్పన రంగాలపై దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. ఈజీ ఆఫ్ లీవింగ్‌కు అధిక ప్రాధాన్యత కల్పించినట్లు చెప్పారు.
రైతుల ఆదాయాన్ని పెంచే ఆలోచనతో బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఆ దిశగానే ఎన్నో చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇక నుంచి రైతులు అతి సులువుగా రుణాలు తీసుకోవచ్చు అన్నారు. ఏపీఎంసీ మార్కెట్లను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ మౌళికసాదుయాల నిధితో ఇది సాధ్యం అవుతుందన్నారు. సామాన్యులపై పన్ను భారం పడుతుందని చాలా మంది ఆలోచించారని, కానీ తాము పారదర్శకమైన బడ్జెట్‌పై ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. ఈ బడ్జెట్‌తో కొత్త సంస్కరణలకు తీసుకువచ్చే ప్రయత్నం చేశామన్నారు.
ప్రోయాక్టివ్ బడ్జెట్‌ను తయారు చేశామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ బడ్జెట్‌తో దేశ ప్రజల సంపద, ఆరోగ్యం పెరుగుతుందని, దేశ సమగ్ర అభివృద్ధికి ఇవే కీలకం అన్నారు. మౌళిక సదుపాయాల వ్యయాన్ని పెంచినట్లు చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపుపై దృష్టిపెట్టామన్నారు. తాము తీసుకున్న అన్ని నిర్ణయాల్లో గ్రామాలు, రైతులే కేంద్రంగా ఉన్నట్లు చెప్పారు. దీంతో సంపూర్ణ వికాసం సాధ్యమన్నారు.