చెట్టును నరికిన వ్యక్తికి రూ. 62 వేల జరిమానా

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్‌లో ఇటీవల చెట్టును నరికిన ఓ వ్యక్తికి అటవీశాఖ భారీగా జరిమానా విధించింది. నలభై ఏళ్లుగా ఉంటున్న భారీ వేపచెట్టును ఇంటి నిర్మాణానికి అడ్డొస్తుందని స్థలం యజమాని కొట్టేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన 8వ తరగతి విద్యార్థి బాధ్యతాయుతంగా వ్యవహరించి అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. చెట్టును నరికిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. స్పందించిన అటవీశాఖ అధికారులు విచారణ జరిపి అనుమతి లేకుండా చెట్టును నరికిన వ్యక్తి వివరాలను గుర్తించారు. నేరానికి పాల్పడినందుకు రూ. 62,075 జరిమానా  విధించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించిన బాలుడిని అధికారులు అభినందించారు.