జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్‌గా శ్రీల‌త‌

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ) మేయ‌ర్‌గా బంజారాహిల్స్ కార్పొరేట‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి ఎన్నిక‌య్యారు. డిప్యూటీ మేయ‌ర్‌గా తార్నాక కార్పొరేట‌ర్ మోతె శ్రీల‌త ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారి శ్వేతా మ‌హంతి అధికారికంగా ప్ర‌క‌టించారు. మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్‌తో పాటు కార్పొరేట‌ర్ల‌కు శ్వేతామ‌హంతి శుభాకాంక్ష‌లు తెలిపారు.

నూత‌నంగా ఎన్నికైన మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మికి, డిప్యూటీ మేయ‌ర్ శ్రీల‌త‌కు టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు శుభాకాంక్ష‌లు తెలిపారు. మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి పేరును కార్పొరేటర్ బాబాఫ‌సీయుద్దీన్‌, గాజుల‌రామారం కార్పొరేట‌ర్ శేష‌గిరి ప్ర‌తిపాదించారు. డిప్యూటీ మేయ‌ర్‌గా శ్రీల‌త పేరును మ‌చ్చ‌బొల్లారం కార్పొరేట‌ర్ రాజ్ జితేంద‌ర్ నాథ్, కూక‌ట్‌ప‌ల్లి కార్పొరేట‌ర్ జూప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ‌ ప్ర‌తిపాదించారు. అనంత‌రం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారి శ్వేతా మ‌హంతి ఎన్నిక ప్ర‌క్రియ చేప‌ట్టారు. చేతులెత్తే విధానం ద్వారా మేయ‌ర్‌ను ఎన్నుకున్నారు. మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు ఎంఐఎం మ‌ద్ద‌తు ఇచ్చింది.