తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం : నలుగురు మృతి

తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం మండలం రావులపాడు వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొని నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డు అవతలివైపు వెళ్తున్న కారును ఢీకొట్టింది. మృతులను పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామస్థులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారకులైన వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు దిగి పరారీ అయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు నంబర్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.