పుదుచ్చేరి ఎల్జీ గా తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అదనపు బాధ్యతలు
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పుదుచ్చేరిలో మంగళవారం అనూహ్య పరిణామాలు సంభవించాయి. మరో ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఇదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కిరణ్‌బేడీని పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. బేడీని తొలగించాలంటూ సీఎం నారాయణస్వామి రాష్ట్రపతిని కోరిన వారానికే ఆమెకు ఉద్వాసన పలుకటం గమనార్హం. 2016లో ఎల్జీగా నియమితులైనప్పటి నుంచి కిరణ్‌బేడీకి, ప్రభుత్వానికి మధ్య వివిధ అంశాల్లో విభేదాలు నెలకొన్నాయి.