- పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన అదనపు కలెక్టర్ వీరారెడ్డి
- నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తుల విజ్ఞప్తి
కంది మండల పరిధిలోని ఎర్దనూర్ గ్రామ శివారులో సర్వే నెం.231/1లో గల 10 హెక్టార్ల (25 ఎకరాల) భూమిలో ఎస్ఆర్ ఇండస్ట్రీస్ పేరిట బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్ కోసం నూతనంగా మైనింగ్‌ను స్థాపించేందుకు పర్యావరణ ప్రజాభిప్రాయణ చేపట్టారు. ఈ మేరకు గురువారం స్థానిక అదనపు కలెక్టర్ వీరారెడ్డి, పర్యావరణ ఇంజినీర్ సురేశ్‌బాబు అధ్యక్షతన ఎర్దనూర్ తండా, ఎర్దనూర్ గ్రామస్తులతో ప్రజాభిప్రాయ కార్యక్రమం చేపట్టారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా డీఎస్పీ బాలాజీ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ ఈ మైనింగ్ ఇండస్ట్రీ వల్ల ఎవరికైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని కోరారు. ఇందులో గ్రామస్తులు కొంత మంది మైనింగ్ ఇండస్త్రీ స్థాపనకు ఎలాంటి ఇబ్బంది లేదని, వీటి వల్ల కాలుష్యం ప్రబలే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మైనింగ్ ఏర్పాటు తర్వాత స్థానికులకు ఏమైనా ఉపాధి కల్పించాలని కొందరు గ్రామస్తులు సభాముఖంగా కోరారు. పంట పొలాలు కూడా ఈ కాలుష్యంతో దెబ్బతింటాయని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. భూములు ఏమైనా కోల్పోతే వాటికి నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
– రఘువరణ్, ఎస్ఆర్ మైనింగ్ యజమాని
మైనింగ్ ఏర్పాటుతో చుట్టు పక్కల ఉన్న గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఎస్ఆర్ మైనింగ్ యజమాని రఘువరణ్ తెలిపారు. బ్లాస్టింగ్ సమయంలో దుమ్ము ఎక్కువగా రాకుండా దుబాయ్ బుష్‌లు మైనింగ్ చుట్టూ ఏర్పాటు చేయిస్తామన్నారు. మైనింగ్ మొత్తం కొత్త ఆధునిక పరికరాలతోనే నిర్వహించడం ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన గ్రామస్తులకు వివరించారు. రాష్ట్ర డీఎంజీ రొనాల్డ్ రోస్ ఆదేశాల మేరకు ఇప్పటివరకు సంగారెడ్డి జిల్లా నుంచే మూడు రెట్లు రు.70 కోట్లు రాయల్టీ అందజేశామన్నారు. అదేవిధంగా చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొందరు కోరిన విధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అవసరమైన వారికి నష్టపరిహారం చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మైనింగ్ మొదలైన వెంటనే గ్రామం మొదలు నుంచి మైనింగ్ ఏరియా వరకు మొత్తం బీటీ రోడ్డు వేయిస్తామని హామీ ఆయన ఇచ్చారు. కార్యక్రమంలో ఎర్దనూర్, ఎర్దనూర్ తండా సర్పంచ్‌లు దర్గాగౌడ్, రాందాస్, ఎంపీటీసీ, గ్రామస్తులు పాల్గొన్నారు.