మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. ప్రాథమిక సభ్యత్వంతోపాటు, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన కూన.. ప్రస్తుతం మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు.
కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరుతున్నానని కూన శ్రీశైలం గౌడ్ ప్రకటించారు. మూడు దశాబ్దాలుగా తాను రాజకీయాల్లో ఉంటున్నానని, 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకున్నా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందానని చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోరాడానని తెలిపారు. గత ఏడేండ్లుగా కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని వెల్లడించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కూడా ప్రజాసమస్యలపై పోరాటంలో కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యిందని ఆరోపించారు. బీజేపీలో చేరడానికి ఢిల్లీ బయలుదేరుతున్నానని చెప్పారు. ఎమ్మెల్యేలను నిలుపుకోవడంలోనూ కాంగ్రెస్ విఫలమయ్యిందన్నారు. ప్రభుత్వంపై కాంగ్రెస్ పోరాడలేదని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. అంతర్గత కుమ్మలాటల వల్లే పీసీసీ చీఫ్ ఎంపికలో జాప్యం జరుగుతున్నదని విమర్శించారు.