దేశంలో ఎక్కువ మొక్కలు నాటింది తెలంగాణ రాష్ట్రం : కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్

దేశంలో ఎక్కువ మొక్కలు నాటిన రాష్ట్రం తెలంగాణేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం రాజ్యసభలో ఎంపీ జి.సి. చంద్రశేఖర్‌ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖల మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 150.23 కోట్ల మొక్కలు నాటగా కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 38.17 కోట్ల మొక్కలు నాటినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ వెల్లడించారు. అంతరించిపోయిన అడవుల విస్తీర్ణం పెంపునకు ప్రభుత్వం యజ్ఞంలా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. పర్యావరణ సమతుల్యత, పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం 2015లో ఈ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఏటా కోట్లాది మొక్కలను నాటుతూ సంరక్షిస్తున్నది.