వన్యప్రాణుల సంరక్షణతోనే జీవుల సమతుల్యత సాధ్యమని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మావన – జంతు సంఘర్షణల నివారణకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షత నియమించిన సూచనల కమిటీ శనివారం అరణ్య భవన్‌లో సమావేశమైంది. పులుల దాడుల్లో మరణాలను అరికట్టే దిశగా చేపట్టాల్సిన చర్యలు, మానవ- జంతు సంఘర్షణ నివారణకు విధాన రూపకల్పన, క్రూరమృగాల దాడుల్లో మనుషులు మృతి చెందటం, గాయపడటం, పెంపుడు జంతువుల మృతి, పంట నష్టం పరిహార చెల్లింపుల సవరణల తదితర అంశాలపై కమిటీ చర్చించింది. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటకతోపాటు మహారాష్ట్రలో నష్ట పరిహారం చెల్లింపులు విధానాలపై కమిటీ ఆరా తీసింది.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి నష్టపరిహారం చెల్లింపుపై ఎలాంటి సవరణ చేయలేదని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరణ చేపట్టాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. మానవ- జంతు సంఘర్షణ నివారణకు సూచలివ్వాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కమిటీని ఆదేశించారు. మూడు నెలల్లోపు సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సిఫారసు చేయాలని చెప్పారు. వన్యప్రాణుల ఆవాసాలను నాశనం చేయడం, విచక్షణారహితంగా అడవులు నరుకుతూ వాటి తావులను, మంచినీటి వనరులను, పశువుల మేతకు సహాజ గడ్డి మైదానాలను ధ్వంసం చేయడం వల్ల అడవి జంతువులు గ్రామాల్లోకి, పట్టణాల్లోకి వస్తున్నాయని కమిటీ అభిప్రాయపడింది. అటవీ జంతువులు ఆహారం కోసం మనుషులు, పశువులపై దాడులు కూడా చేస్తున్నాయని పేర్కొంది. జంతువులకు సహజసిద్ధమైన ఆవాసాలను కల్పించడం, జంతు జాతులను సంరక్షించడం, నీటి వనరులను పెంచడం వల్ల మానవ- జంతు సంఘర్షణను నివారించవచ్చని కమిటీ సభ్యులు సూచించారు.మనుషులకు- జంతువులు మధ్య పెరుగుతున్న ఘర్షణను నివారించేందుకు ఆక్రమణకు గురైన వన్యప్రాణుల ఆవాసాలను, ధ్వంసమైన సహాజ గడ్డి మైదానాలను పునరుద్ధరించడం, వాటికి అడవులలోనే ఏడాది పొడవునా ఆహారం, నీటిని అందించేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని అభిప్రాయపడింది. వేసవిలో అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ప్రధాన పులుల ఆవాస ప్రాంతాల్లో రోటేషన్ పద్ధతిలో వాటి ఆకలి తీర్చే వన్యప్రాణుల (ప్రే యానిమల్) మేత కోసం మూడు సంవత్సరాల కార్యాచరణను ప్రవేశపెట్టాలన్నారు. పశువులు, మనుషులు అడవుల్లోకి రాకుండా, వన్యప్రాణులకు అడవి నుంచి బయటకు రాకుండా చుట్టూ కందకాలు తీయడంతో అడవికి రక్షణ ఏర్పడుతుందని తెలిపారు. వన్యప్రాణులను వేట, ఉచ్చులు వేయడం, పంట పొలాల చుట్టు కరెంట్ తీగలను అమర్చడం లాంటి చేయకుండా కఠిన నియంత్రణ చర్యలు తీసుకోవడంతోపాటు నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు.పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల కాల్చివేతకు ప్రభుత్వ ఉత్తర్వులు, అటవీ శాఖ మార్గదర్శకాల గురించి పీసీసీఎఫ్ ఆర్. శోభ కమిటీ సభ్యులకు వివరించారు. కుమ్రం భీం- ఆసిపాభాద్ జిల్లాల్లో పులి దాడిలో మరణించిన రెండు భాదిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి అటవీ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చామని చెప్పారు.సమావేశంలో కమిటీ సభ్యులు రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్ శోభ, మాజీ శాసన సభ్యుడు జీ అరవింద్ రెడ్డి, అదనపు పీసీసీఎఫ్ సిద్ధానంద్ కుక్రేటి, జాతీయ పులుల సంరక్షణ కేంద్రం (ఎన్టీసీఏ) సభ్యుడు మురళీ, డబ్లూడబ్ల్యూఎఫ్ ప్రతినిధులు అనిల్ కుమార్ ఏపుర్, ఫరీదా తంపాల్, పర్యావరణ నిపుణులు రాజీవ్ మాథ్యూ, ఇమ్రాన్ సిద్ధిఖీ, వన్యప్రాణి సంరక్షణ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.0People Reached0EngagementsBoost PostLikeCommentShare
