తెలంగాణలో కొత్తగా 684 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో 684 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. వైరస్‌ ప్రభావంతో మరో ముగ్గురు మృత్యువాతపడ్డారు. కొత్తగా వైరస్‌ నుంచి 394 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,665 యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రస్తుతం 1,873 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

కొత్తగా రికార్డయిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 184 ఉన్నాయి. మంగళవారం రాష్ట్రంలో 56,122 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,07,889కు చేరగా.. 3,01,227 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,697కు పెరిగింది. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది.