టేకు చెట్ల నరికివేతపై విచారణ

యథేచ్ఛగా టేకు చెట్ల నరికివేతపై సీసీఎఫ్‌ ఆదేశాల మేరకు జిల్లా అటవీ శాఖ ఫ్లయింగ్‌ స్కాడ్‌ అధికారులు స్పందించారు. దస్తురాబాద్‌ బీట్‌లోని దస్తురాబాద్‌, ఆకొండపేట గ్రామాల్లో నరికివేతకు గురైన టేకు చెట్లను ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఫ్లయింగ్‌ స్కాడ్‌ ఎఫ్‌డీవో రవీందర్‌ బుధవారం పరిశీలించి, విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…టేకు చెట్లను గుర్తు తెలియని దుండగులు నరికివేసింది వాస్తవమేనని తెలిపారు. ఖానాపూర్‌ ఎఫ్‌డీవో కోటేశ్వర్‌ ఆధ్వర్యంలో రెండు బృందాలతో విచారణ చేపట్టి పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అడవిని ధ్వంసం చేసినా, చెట్లు నరికి కలపను రవాణా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఎఫ్‌బీవోలు కృష్ణ చైతన్య, కిరణ్‌ తదితరులున్నారు.