తెలంగాణలో కొత్తగా 965 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 965 కొవిడ్ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవగా.. ఐదు మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. మరో 312 మంది బాధితులు కోలుకొని హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో వైపు క్రియాశీల కేసులు ఆరువేలు దాటాయి.

ప్రస్తుతం 6,159 యాక్టివ్‌ కేసులున్నాయని, ప్రసుతం హోం ఐసోలేషన్‌లో 2,622 మంది బాధితులున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో 254 కేసులు జీహెచ్‌ఎంసీలోనే ఉన్నాయి. జీహెచ్‌ఎంసీతో పాటు జిల్లాల్లోనూ పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నిన్న ఒకే రోజు రాష్ట్రంలో నిన్న 59,343 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,09,741కి చేరగా.. మరణాల సంఖ్య 1,706కు పెరిగింది.