పచ్చదనం పెంపు, పరిసరాల శుభ్రత అందరి బాధ్యత, గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా సొంత ఊరిలో వేలాది మొక్కలు నాటించిన అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావు
ఎంత ఎత్తు ఎదిగినా, సొంత ఊరిని, కని పెంచిన తల్లిదండ్రులను మరువ కూడదనేది నానుడి. తాము పుట్టిపెరిగిన ఊరితో అనుబంధాన్ని కొనసాగించడం ఓ మధురానుభూతి. సరిగ్గా ఇదే పని చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావు గారు. తన ఊరు ఆకు పచ్చగా, పరి శుభ్రంగా ఉండాలని తలచారు. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా లింగన్న పేట తన స్వగ్రామం. తనకు ఉన్నభూమిలో 4 ఎకరాలను పచ్చదనం పెంపుకు కేటాయించాలని నిర్ణయించారు. అయితే ఆభూమి రాళ్లు, రప్పలతో ఉండటంతో తానే చొరవ తీసుకున్నారు. కొంత భూమిని తొలగించి, ఒక మీటరు మేర ఎర్ర మట్టిని నింపారు. గ్రామస్థులను కూడా చైతన్య పరిచి మొక్కలు నాటే పనికి పూనుకున్నారు. అందరి సహకారంతో 1300 టేకు,1300 రోజ్ వుడ్, 800 కదంబ, 1000 ఎర్ర చందనం, 300 సంపంగి, 200 సిల్వర్ ఓక్ చెట్లను నాటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు హరితహారం, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్ తనలో స్ఫూర్తిని నింపాయని రామచందర్ రావు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, హరిత తెలంగాణ సాధన లక్ష్యంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.