ఏపీలో పరిషత్‌ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ

ఏపీలో పరిషత్‌ ఎన్నికలను నిలిపివేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్‌ నిబంధన అమలు కాలేదని పేర్కొంది.

ఈ విషయాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికలు నిలిపివేయాలంటూ టీడీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

మంగళవారం పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. కనీసం 4 వారాల ఎన్నికల కోడ్‌ ఉండాలన్న నిబంధన అమలు కాలేదని పిటిషన్ల వాదనతో కోర్టు ఏకీభవించింది.

పరిషత్‌ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ అవసరం లేదని స్పష్టంచేసింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. 15న మళ్లీ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎస్‌ఈసీని ఆదేశించింది.

ఈ నెల 8న రాష్ట్రంలోని 516 జడ్పీటీసీ, 7,258 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సర్వం సిద్ధం చేసింది.

ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్‌ నేపథ్యంలో రేపు, ఎల్లుండి సెలవు దినాలుగా ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ సోమవారం ఉత్తర్వులు సైతం జారీ చేశారు.