ఇవాళ సాయంత్రంతో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

ఇవాళ సాయంత్రం 5 గంటలకు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి ప్రచారం చేయవద్దని ఎస్‌ఈసీ సూచించింది. సభలు, సమావేశాలకు అనుమతి లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రచారానికి సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ సైతం వాడకూడదని హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తామని ఎస్‌ఈసీ పేర్కొన్నది. ప్రచారం ముగిసిన వెంటనే మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని యాజమాన్యాలకు తెలియజేసింది. పోలింగ్‌ ముగిసే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఎస్‌ఈసీ తెలిపింది. ఓటరు స్లిప్పులను www.tsec.gov.inలో పొందే అవకాశం ఉందని తెలిపింది. టీపోల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా ఓటరు స్లిప్పులు పొందవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఉద్యోగులు కూడా ఓటు వేసేందుకు ముందుకు రావాలని, వారికి కంపెనీలు 3 గంటల పాటు సమయమివ్వాలని ఆయా కంపెనీలను ఆదేశించింది. ఓటు గోప్యతకు భంగం కలిగిస్తే 3 నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తామని ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది.
ఈ నెల 22న 9 నగరపాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో పోలింగ్‌ జరగనుంది. 9 కార్పోరేషన్లలోని 325 వార్డుల్లో 1,438 పోలింగ్‌ కేంద్రాలు, 120 మున్సిపాలిటీల్లోని 2, 727 వార్డుల్లో 6, 325 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈసీ పేర్కొన్నది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని డబీర్‌పురా డివిజన్‌లోనూ పోలింగ్‌ జరగనుంది. కాగా, కరీంనగర్‌ మున్సిపాలిటీలో మాత్రం ఈ నెల 22న ప్రచారం ముగియనుంది. ఓటరు జాబితాలో తేడాలున్నాయని విపక్షాలు కోర్టులో కేసు వేయడంతో ఈ మున్సిపాలిటీకి కాస్త విరామం లభించింది.