భూలోక వైకుంఠంగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం స్వామివారి తిరుకల్యాణ వేడుకలు జరుగుతున్నాయి. వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు సమర్పించారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వామివారి కల్యాణఘట్టం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఇతర ప్రజాప్రతినిధులు కూడా కల్యాణ వేడుకకు హాజరయ్యారు. కరోనా కారణంగా ఆంతరంగికంగా రాములోరి కల్యాణం జరుగుతోంది. కరోనా తీవ్రత దృష్ట్యా భక్తులకు అనుమతి నిరాకరించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. వరుసగా రెండో ఏడాదీ భక్తుల లేకుండా స్వామివారి కల్యాణం జరుగుతోంది. రేపు శ్రీరాముని మహాపట్టాభిషేకం కార్యక్రమం జరగనుంది.