
నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చిట్యాల, చండూర్ పట్టణ పురపాలక సంఘాల ఎన్నిక కోసం బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలతో పోలింగ్ ముగిసింది. ఎక్కడా ఎలాంటి చెదురుమొదురు ఘటనలు కూడా నమోదు కాకుండా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. జిల్లాలో మొత్తం 79.50 శాతం ఓట్లు పోలయ్యాయి. 2,81,444 మంది ఓటర్లకు.. 2,23,684 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా చండూర్ 92.01 శాతం పోలింగ్ న మోదుకాగా.. చిట్యాలలో 89.75, హాలియాలో 88.14, దేవరకొండలో 83.35, మిర్యాలగూడలో 79.31, నల్లగొండలో 77.09 శాతం పోలింగ్ నమోదైంది. నందికొండలో అతి తక్కువగా కేవలం 63.74 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా ఇన్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, ఎస్పీ రంగనాథ్, ఎన్నికల పరిశీలకురాలు కొర్రా లక్ష్మి జిల్లాలోని పలు పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.