హరితోత్సవానికి అంతా సిద్ధం : అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకర్‌ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన ఏడో విడ‌త హరిత‌హార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకర్‌ రెడ్డి తెలిపారు. జూలై 1 నుంచి జూలై 10 వ‌ర‌కు ఏడో విడ‌త హరిత‌హార కార్యక్రమం కొనసాగనుంద‌న్నారు. అంబ‌ర్‌పేట్ క‌లాన్‌లోని ఔట‌ర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న రిజ‌ర్వ్ ఫారెస్ట్ ఏరియా కార్యక్రమ ప్రారంభోత్సవానికి వేదిక కానుంద‌న్నారు. ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో క‌లిసి హ‌రిత‌హార కార్యక్రామాన్ని లాంఛ‌నంగా ప్రారంభించనున్నట్లు ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. హరితహారంలో భాగంగా హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన అంబ‌ర్ పేట్ క‌లాన్ అర్బన్ ఫారెస్ట్ పార్కును కూడా ప్రారంభించ‌నున్నట్లు తెలిపారు.

ఆరు విడతల హరితహారం విజయవంతమైన స్ఫూర్తితో ఏడో విడత హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరూ భాగ‌స్వాములై మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని మంత్రి పిలుపునిచ్చారు. ఇందుకు అనుగుణంగా నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచామ‌న్నారు. ఇప్పటికే మొక్కలు నాటేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు.

హ‌రితహారం కార్యక్రమంలో 230 కోట్ల మొక్కలు నాటాల‌న్న ల‌క్ష్యానికి చేరువలో ఉన్నామ‌ని, ఈ ఏడాది ల‌క్ష్యాన్ని అధిగ‌మించ‌నున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆరు విడ‌త‌ల్లో 220.70 కోట్ల మొక్కలు నాటామ‌ని, ఏడో విడ‌త హ‌రిత‌హారం 2021-22 సంవత్సరంలో 19.91 కోట్ల మొక్కలను నాటాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు.