నాటిన ప్రతి మొక్క బతకాలి : అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

ప్రభుత్వం మహోన్నత ఆశయంతో హరితహారం చేపట్టింద‌ని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత మ‌నంద‌రిపై ఉంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. తెలంగాణకు హరితహారం ఏడో విడత కార్యక్రమంలో భాగంగా మంత్రి ఎల్లపల్లిలో మొక్కలు నాటారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…క‌రోనా లాంటి విపత్కర పరిస్థితులు చూశామన్నారు. కరోనా వ‌ల్ల స‌కాలంలో ఆక్సిజ‌న్ అంద‌క ఎంతో మంది ప్రాణాలు కొల్పోయార‌న్నారు. ప్రాణ వాయువును ఇచ్చే చెట్లను విచ‌క్షణ ర‌హితంగా న‌రికివేయ‌డం వ‌ల్ల ఇవాళ స్వచ్ఛమైన ప్రాణ వాయువు ల‌భించే ప‌రిస్థితి లేద‌న్నారు. భ‌విష్యత్‌ త‌రాలను దృష్టి పెట్టుకుని విస్తృతంగా మొక్కలు నాటి వాటిని ప‌రిర‌క్షించాల్సిన బాధ్యత అంద‌రిపై ఉంద‌ని పేర్కొన్నారు.

హరితహారాన్ని ప్రభుత్వ కార్యక్రమ‌నే కాకుండా ప్రతి ఒక్కరూ తమ సొంత కార్యక్రమంగా భావించి మొక్కలను నాటి బాధ్యత తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య ప‌నులు చేప‌ట్టి సీజ‌న‌ల్ వ్యాధులు సోక‌కుండా త‌గు జాగ్రత్తలు తీసుకోవాల‌న్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ముష్రాఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్లు హేమంత్ బొర్కడె, జిల్లా అట‌వీ శాఖ అధికారి వికాస్ మీనా, త‌దిత‌రులు పాల్గొన్నారు.