కేటీఆర్ పుట్టిన‌రోజున తెలంగాణ‌లో ముక్కోటి వృక్షార్చ‌న‌

రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్‌శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన‌రోజు జులై 24. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. జులై 24న రాష్ట్ర‌వ్యాప్తంగా గంట‌లో మూడు కోట్ల మొక్క‌లు నాటేందుకు సిద్ధ‌మౌతోంది. ఇందుకు సంబంధించి ముక్కోటి వృక్షార్చ‌న బ్రోచ‌ర్‌ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ మంగ‌ళ‌వారం బ్రోచ‌ర్‌ను ఆవిష్క‌రించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌తో పాటు పార్టీ కేడర్ తెలంగాణ వృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వేసిన మార్గాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రిలో కోటి వృక్షార్చ‌న‌ను చేప‌ట్టిన తీరును తెలిపారు. అదేవిధంగా జులై 24న మూడు కోట్ల మొక్క‌లు నాటి కేటీఆర్‌కు బ‌హుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణ‌హితానికి మీ సాయంగా ఈ కార్య‌క్ర‌మంలో పెద్దఎత్తున పాల్గొనాల్సిందిగా ప్ర‌జ‌ల‌కు ఆయ‌న‌ విజ్ఞ‌ప్తి చేశారు.

ఎటువంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ‌తో పాటు దేశ‌వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతుండ‌టంపై ఎంపీ సంతోష్ కుమార్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యే జోగు రామ‌న్న పుట్టిన‌రోజు జులై 4 ను పుర‌స్క‌రించుకుని ఆదిలాబాద్ జిల్లా ప‌ది ల‌క్ష‌ల మొక్క‌లు నాటిన‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన వీడియో రికార్డును గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుకు పంపించిన‌ట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వండ‌ర్ బుక్ ప్ర‌తినిధుల నుండి ప్ర‌శంసా ప‌త్రాన్ని అందుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

ముక్కోటి వృక్షార్చ‌న బ్రోచ‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో మంత్రులు మ‌హ‌మూద్ అలీ, జ‌గ‌దీష్‌రెడ్డి, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, శ్రీ‌నివాస్ గౌడ్‌, మ‌ల్లారెడ్డి, ఎంపీ కేశ‌వ‌రావు, ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్‌, ఎమ్మెల్యేలు గాద‌రి కిశోర్‌, శానంపూడి సైది రెడ్డి పాల్గొన్నారు.