
తెలంగాణ ప్రభుత్వం హరితహారం పథకాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రాన్ని పచ్చదనంగా మార్చేందుకు భారీ సంఖ్యలో మొక్కలు నాటుతున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారంలో భాగంగా సుమారు 230 కోట్ల మొక్కలు నాటేందుకు కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో తెలిపారు. అమెరికాకు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ ఓనర్ మార్క్ బెనిఫ్‌కు ట్యాగ్ చేసిన ట్వీట్‌లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. దావోస్‌లో జరుగుతన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో వాతావరణ మార్పులపై ప్రపంచదేశాధినేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రిలియన్ మొక్కలు నాటాలన్న సంకల్పం తీసుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో 2021 నుంచి 2030 వరకు ట్రిలియన్ మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్ల క్రితమే మొక్కలు నాటడం ప్రారంభమైందని, ఇప్పటికే 70 శాతం టార్గెట్‌ను చేరుకున్నామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు విశేష స్పందన వస్తున్నది. అన్ని రంగాల సెలబ్రిటీలతో పాటు ప్రముఖులు మొక్కలు నాటుతూ మరో ముగ్గురికి సవాల్ చేస్తున్నారు.